ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె గాయత్రి(38) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను cకి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమార్తె గాయత్రితోపాటు కుమారుడు కూడా ఉన్నారు. గాయత్రిది ప్రేమ వివాహం. ఆమెకు ఓ కూతురు కూడా ఉన్నారు. చిన్నప్పట్నుంచీ గాయత్రిని రాజేంద్రప్రసాద్ ఎంతో గారాబంగా పెంచారని తెలుస్తున్నది. ప్రాణాధికంగా పెంచుకున్న కన్నబిడ్డ మరణంతో రాజేంద్రప్రసాద్ తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. ఆయన కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. ఈ నేపథ్యంలో పలువురు సినీరాజకీయ ప్రముఖులు రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
కేటీఆర్ సంతాపం: ‘సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌గారి కుమార్తె మరణం నన్ను తీవ్రంగా బాధించింది. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడం ఎంతో బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టాన్ని ఎదుర్కొనేంత ధైర్యాన్ని వారి కుటుంబానికి ప్రసాదించాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నా. రాజేంద్రప్రసాద్‌గారు మనోనిబ్బరాన్ని కోల్పోవద్దని కోరుకుంటున్నా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) ద్వారా స్పందించారు. ఇంకా చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సాయిదుర్గతేజ్, వరుణ్‌తేజ్, నవదీప్, కీర్తి సురేశ్, నరేశ్ కూడా రాజేంద్రప్రసాద్ కుటుంబానికి పరామర్శించిన వారిలో ఉన్నారు.