RC15 | శంకర్ సినిమాలంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేది గ్రాండ్‌నెస్. ఈయన సినిమాల్లో ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. బడ్జెట్ ఎంతైనా సరే శంకర్ అనుకున్న అవుట్‌పుట్ వచ్చేంతవరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ విషయంలో శంకర్ అస్సలు తగ్గడు. అందుకే ఈయన పాటలు స్క్రీన్‌పై అంత అద్భుతంగా కనిపిస్తాయి. కేవలం ఈయన సినిమాల్లోని పాటలు చూడటానికే రిపీటెడ్‌గా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులున్నారు. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌పైన కనిపిస్తుంది. శంకర్ ఒక్క పాటపై పెట్టే బడ్జెట్లో ఓ మీడియం రేంజ్ హీరో సినిమా తీసేయోచ్చు. అంతలా శంకర్ తన సినిమాల్లో పాటలను రిచ్ లెవల్లో చూపిస్తాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ దర్శకుడు రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్, కమల్‌తో భారతీయుడు-2 చేస్తున్నాడు. కాగా గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ఓ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ఈ సినిమాలో కేవలం పాటల కోసమే మేకర్స్ దాదాపు వంద కోట్లు ఖర్చుపెడుతున్నట్లు ఇన్సైడ్ టాక్. శంకర్ పాటల కోసం ప్రత్యేకించి సెట్లను ప్లాన్ చేస్తున్నాడట. థమన్ కూడా దానికి తగ్గట్లే అదిరిపోయే రేంజ్లో 5 ట్యూన్లు కంపోజ్ చేస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి లీకైన చరణ్ ఫోటోలకు విశేష స్పందన వచ్చింది. రామ్‌చరణ్‌కు జోడీగా కియరా అద్వాని, అంజలిలు నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.