Gaddar Awards | ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఉగాది రోజున ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ప్రముఖ నటులు ఎం.ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13వ తేదీ నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు.
2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్ర అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైఖ్యతా చిత్రం, బాలల చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీటితో పాటు తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ , షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లో కూడా అవార్డులను అందించనున్నారు. తెలుగు సినిమాపై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన ఫిల్మ్ జర్నలిస్ట్‌లకు కూడా అవార్డులను అందజేస్తామని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తొలిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.