Gadar-2 Movie | రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సన్నీ డియోల్ రూ.500 కోట్లు కొల్లగొట్టే సినిమాలో భాగం అవుతాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఎప్పుడో సోలో హీరోగా మార్కెట్ కోల్పోయిన సన్నీ డియోల్ ఇలా ఊహకందని రేంజ్లో ఖాన్, కపూర్ల సినిమాలను బ్రేక్ చేస్తూ సంచలన రికార్డులు నెలకొల్పుతున్నాడు. బి.సి సెంటర్ల ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో గదర్-2 నిరూపించింది. సినిమా వచ్చి నాలుగు వారాలైన ఇంకా కొన్ని చోట్లు గదర్ గర్జనే వినిపిస్తుంది. జవాన్ ముందు వరకు కొత్త రిలీజ్లు ఎన్నొచ్చినా గదర్-2 సినిమా యుఫోరియాను మ్యాచ్ చేయలేకపోయాయి. అయితే గురువారం రిలీజైన ‘జవాన్’తో ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.511 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. మరో రూ.32 కోట్లు కలెక్ట్ చేస్తే హిందీ చిత్ర సీమలో సరికొత్త ఇండస్ట్రీ హిట్‌గా గదర్-2 నిలుస్తుంది. దీనికంటే ముందు పఠాన్ సినిమా ఉంది. ఈ సినిమా రూ.543 కోట్లతో తొలి స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే బాహుబలి(రూ.510 కోట్లు) దాటేసిన గదర్-2, పఠాన్ సినిమా కలెక్షన్లు కూడా దాటేస్తుందని పలువురు నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే కొందరు అది అనితర సాధ్యమని అంటున్నారు. ఎందుకంటే హిందీ ఆడియెన్స్‌కు ఇప్పుడు జవాన్ తప్పితే మరో సినిమా కనిపించడం లేదు. జవాన్ టిక్కట్లు దొరక్కపోతే గదర్ను ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు.
ఇలాంటి టైమ్‌లో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే కష్టమేనని చెప్పాలి. అయితే శని, ఆదివారాల బుకింగ్స్ పర్వాలేదనించేలానే ఉన్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరి గదర్-2 కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందో లేదో చూడాలి. అమీషా పటేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి దర్శకుడు అనీల్ శర్మ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.