NTR | ఒకవైపు స్టార్‌గా మరోవైపు నటుడిగా సినిమా సినిమాకు ఎదుగుతూ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో నటుడిగా ఆయన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్‌కు సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువైపోయాయి. రీసెంట్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘గదర్ -2’ దర్శకుడు అనిల్ శర్మ ప్రత్యేకంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు.
ఈ సినిమాలో సన్నీడియోల్ పోషించిన తారాసింగ్ పాత్రను నేటి తరం హీరోల్లో ఎవరు పోషించగలరనుకుంటున్నారు? అని ఓ విలేకరి అడగ్గా.. “నాకు తెలిసి ఈ పాత్రను బాలీవుడ్లో అయితే ఎవరూ చేయలేరు. అంత సామర్థ్యం ఉన్న హీరో ఇక్కడ నాకెవరూ కనిపించలేదు. అయితే సౌతిండియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తారాసింగ్ పాత్రకు అద్భుతంగా న్యాయం చేయగలడు. ఆయన ప్రతిభాపాటవాలు చాలా ప్రత్యేకం” అని సమాధానమిచ్చారు అనిల్ శర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ ఏమిటో ఈ సమాధానంతో అర్థం చేసుకోవచ్చని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.