మాస్ కా దాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి విశ్వక్సేన్ చేసిన విభిన్న చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. గత ఏడాది మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కు ‘గామి’ అధికారికంగా ఎంపికైంది.
ఈ నెల 9వ తేదీ వరకూ జరుగనున్న ఈ వేడుకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విషయంపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాలో మనిషి స్పర్శను తట్టుకోలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న శంకర్ అనే అఘోరాగా విశ్వక్ నటించిన విషయం తెలిసిందే. హిమాలయాల్లో ఉండే ద్రోణగిరి పర్వతశ్రేణుల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. కార్తీక్ శబరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.