First Time | హేమంత్ ఇప్పలపల్లి కథ, కథనం అందిస్తూ తానే స్వయంగా దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని రూపుదిద్దిన వినూత్న చిత్రం “ఫస్ట్ టైం”. అతి తక్కువ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారతదేశంలోనే సరికొత్త మైలురాయిగా నిలిచే భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వండర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోలేదు” అనే ప్రత్యేక గీతాన్ని చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా విడుదల చేసింది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతుండగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ రోల్లో అలరించనున్నారు. అనిక్క విక్రమన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం మరియు ‘ఢీ’ ఫేమ్ పండు వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, వేణు మురళీధర్ మరియు రామ్ తమ కెమెరా పనితనంతో విజువల్స్ అందించారు.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ (కృత్రిమ మేధస్సు) హవా నడుస్తున్న తరుణంలో, ఎక్కడా ఏఐ ని ఇన్వాల్వ్ చేయకుండా కేవలం హెచ్ఐ (హ్యూమన్ ఇంటలిజెన్స్)తోనే అత్యంత నాణ్యమైన, హై రేంజ్ గ్రాఫిక్స్ రూపొందించడం విశేషం. ఈవెంట్లో భాగంగా విడుదల చేసిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి గారు, జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ గారు అతిథులుగా విచ్చేయగా, చిత్ర పరిశ్రమకు చెందిన అందాల తార పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, తాను చిత్ర పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు దాటిందని, ఈ వయసులో తనకు పెళ్లి చేసుకోవాలన్నా కష్టమేనని చమత్కరించారు. అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకుని హేమంత్ ఒక్కడే ఒక సినిమాకు సంబంధించిన ఎన్నో విభాగాలను దగ్గరుండి చూసుకోవడం మరియు ఇంత పెద్ద బాధ్యతను మోయడం అందరం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. సరికొత్త కాన్సెప్ట్ మరియు వైవిధ్యమైన కథతో వస్తున్న ఈ కొత్త కుర్రాళ్ళ ప్రయత్నాన్ని పరిశ్రమ పెద్దలు, ప్రేక్షకులు ఆదరించాలని, ఈ నెల 22వ తేదీన థియేటర్లలోకి రానున్న ఈ “ఫస్ట్ టైం” చిత్రాన్ని వీక్షించి ఘన విజయాన్ని అందించాలని కోరారు.
సంగీత దర్శకుడు శ్రీ వెంకట్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమాకు హేమంత్ గారే మూలస్తంభం అని ప్రశంసించారు. సినిమాకు ఎలాంటి సంగీతం కావాలో హేమంత్ స్పష్టమైన అవగాహనతో తన దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చేయించుకున్నారని, ఈ చిత్రం తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా మిత్రులు కూడా ఈ చిన్న సినిమా విజయానికి తమ వంతు సహకారం అందించాలని, తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన హేమంత్ గారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
నటి గాయత్రి గుప్తా మాట్లాడుతూ, సమాజంలో మార్పు అనేది ఎప్పుడూ కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల వల్లనే సాధ్యమవుతుందని, అలాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్నవారే దువ్వాడ శ్రీనివాస్ గారు మరియు మాధురి గారు అని అభిప్రాయపడ్డారు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన పాయల్ ఎంతో దృఢమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, ఇంతటి కొత్త రకమైన చిత్రాన్ని నిర్మించి, అన్ని పనులను ఒంటిచేత్తో మేనేజ్ చేసిన హేమంత్ శ్రమ అమోఘమని అన్నారు. మే 22న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి ఆశీర్వదించాలని కోరారు.
నటి అనిక్క విక్రమన్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభం నుండి తమ చిత్ర బృందానికి కొండంత అండగా నిలబడిన స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమను ప్రోత్సహించిన పెద్దలందరికీ థాంక్స్ చెబుతూ, ప్రేక్షకులు తమ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని కోరారు.
జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుండి తాను సినిమాను గమనిస్తున్నానని, ఈ సినిమా వెనుక హేమంత్ గారి నిరంతర కష్టం దాగి ఉందన్నారు. కేవలం హీరోల ఇమేజ్ మీద ఆధారపడి సినిమాలు నడుస్తున్న నేటి రోజుల్లో, కథను మరియు దర్శకుడి నమ్మకాన్ని నమ్మి తెరకెక్కిన సినిమా “ఫస్ట్ టైం” అని అన్నారు. ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ (VFX) అతిపెద్ద బలమని, ఈ సినిమా ద్వారా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు వస్తాయని పేర్కొన్నారు.
దర్శక నిర్మాత హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ, తాము సినిమా చేస్తున్నప్పుడు వెనుక ఉండి తమకు ధైర్యాన్ని, భరోసాని ఇచ్చిన వ్యక్తి పాయల్ అని కొనియాడారు. ఈ ఈవెంట్‌కు వచ్చి తమను సపోర్ట్ చేస్తున్న అతిథులకు, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని కేవలం సినిమా థియేటర్లలోనే చూసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మాట్లాడుతూ, “ఫస్ట్ టైం” చిత్రం మన భారతీయ సనాతన ధర్మానికి మరియు నేటి ఆధునికతకు అద్దం పట్టేలా చాలా అద్భుతంగా రూపకల్పన చేశారని ప్రశంసించారు. ఒక సినిమాను నిర్మించడం వెనుక ఎంత కష్టం ఉంటుందో తాను స్వయంగా చూశానని, ఈ చిత్ర బృందానికి తన హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్ లాంటి ఎన్నో క్లిష్టమైన పనులను ఒకే వ్యక్తి చేయడం అనేది మామూలు విషయం కాదని, అలాంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన హేమంత్ గారు గ్రేట్ అని ప్రశంసించారు. ఈ విశ్వాన్ని నడిపించే ఆ బ్రహ్మదేవుడి శక్తులను, సృష్టి రహస్యాలను ఈ సినిమాలో చూపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడదగ్గ చిత్రమిదని అన్నారు. తమను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిత్ర యూనిట్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకున్నారు.
నాయకానటుడు సౌరబ్ ధింగ్ర మాట్లాడుతూ, ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమాను మార్కెట్ లోకి ఎంతో బాధ్యతగా తీసుకువెళ్లిన స్పందన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమా కోసం దర్శకుడు హేమంత్ తన కుటుంబానికి దూరంగా ఉండి రాత్రింబవళ్లు కష్టపడ్డారని గుర్తుచేసుకున్నారు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడంలో సహకరిస్తున్న అతిథులకు థాంక్స్ చెబుతూ, తనకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడి, ప్రోత్సహిస్తూ వచ్చిన పాయల్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “ఇంతకాలం నీ సక్సెస్ చూసి నేను గర్వపడ్డాను, కానీ ఇప్పుడు నా సినిమాతో నువ్వు గర్వపడేలా చేస్తాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వచ్చి సినిమాకు ఎంతో సపోర్ట్ అందిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని ధారపోసి పనిచేశారని, సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఇందులో ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ (VFX) గ్రాఫిక్స్ గురించే మాట్లాడుకుంటారని జోస్యం చెప్పారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తుందని, అలాగే ఇందులో నటించిన నటీనటులందరికీ పరిశ్రమలో మంచి బ్రేక్ వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. హీరో సౌరబ్ గురించి చెబుతూ, అతను సినిమాను ఒక కెరీర్ లా కాకుండా ఒక పవిత్రమైన ప్రతిజ్ఞలా భావించి కష్టపడ్డాడని, భవిష్యత్తులో అతను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పి. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎస్. నాగేశ్వరరావు (ఎస్ఎన్ఆర్) పిఆర్ఓగా వ్యవహరించగా, పుష్యమి మీడియా మార్కెటింగ్ పార్ట్నర్గా మరియు వెంకట్ మజ్జి పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.