రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర కథానాయకుడు ప్రభాస్. కె.కె.రాధాకృష్టకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగేతర రాష్ర్టాల్ని చుట్టేస్తున్నారు ప్రభాస్. శుక్రవారం చెన్నైలో ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి..‘ఈ సినిమా విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరాటం కదా.. ఈ రెండింటిలో చివరకు ఏది గెలుస్తుంది’ అని ప్రభాస్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన ‘దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. మీరు అడిగిన ప్రశ్నలోనే సినిమా మెయిన్ పాయింట్ దాగి ఉంది. దాని గురించి బయటపెడితే నిర్మాతలు ఊరుకోరు. సినిమా చూస్తేనే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. 1970-80 దశకం నేపథ్యంలో జాతకాల చుట్టూ తిరిగే ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్నది.