Film Chamber | తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్‌కు పిలుపునిచ్చాయి. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని. ఈ మేరకు ఫెడరేషన్ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో, నిరసనగా బంద్ ప్రకటించారు. ఫెడరేషన్ బంద్ ఇప్పటికే షూటింగ్‌లపై ప్రభావం చూపిస్తుంది. దాదాపు అన్ని షూటింగ్స్ ఆగినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నడుస్తుండగా,ఇందుకోసం ముంబై నుండి సినీ కార్మికులని రంగంలోకి దింపినట్టు సమాచారం.
అయితే ఈ బంద్‌పై తెలుగు ఫిలించాంబర్ గట్టిగానే స్పందించింది. ఫెడరేషన్ పక్షపాతంగా 30 శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వారికి కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఫెడరేషన్ బంద్ వల్ల నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలసి పనిచేస్తున్న మనం వారి నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ సంబంధింత అధికారులతో చర్చలు జరుపుతోంది. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేదా సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే దిశా నిర్దేశాలని ఖచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి” అంటూ ఫిలిం ఛాంబర్ లేఖలో పేర్కొంది. మరిన్నివివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.
అయితే బంద్ వలన చిత్ర పరిశ్రమ మరింత ఇబ్బందులలో పడుతున్న నేపథ్యంలో బేబి చిత్ర నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇప్పటికే ఆడియన్స్ థియేటర్స్ కి దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటీటీ శాటిలైట్స్ అగమ్యగోచరం, పైరసీ పుండుమీద కారం, పేరుకే వినోద పరిశ్రమ నిర్మాతల శ్రమ విషాదమే అని కామెంట్స్ చేశారు. అయితూ షూటింగ్‌లపై బంద్ ప్రభావం కొనసాగితే, సినిమా రిలీజ్ డేట్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఈ వివాదంలో జోక్యం చేసుకుంటుందా? లేకుంటే ఫిలిం ఛాంబర్ – ఫెడరేషన్ మధ్య చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందా? అన్నది పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.