తమిళనాడు : తమిళనాడు(Thamilanadu) రాజకీయాలపై సినీ నటుడు విశాల్ (Actor Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా టీవీకే విజయం సాధించిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకేనే ఏర్పాటు చేయాలని, టీవీకే కాకుండా మరో ప్రభుత్వం వస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. డీంఎకే, అన్నాడీఎంకే కూటమిని ప్రజలు అంగీకరించరని ఆయన పేర్కొన్నారు.
కాగా, విశాల్ తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ (Thalapathy Vijay) నేతృత్వంలోని TVK (తమిళ వెట్రి కజగం) పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై విశాల్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. గతంలో గోవా, మణిపూర్, మేఘాలయ మరియు ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ.. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని పిలిచి ‘ఫ్లోర్ టెస్ట్’ (బలనిరూపణ) ద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని విశాల్ గుర్తు చేశారు.
ఇప్పుడు తమిళనాడులో TVK పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ, గవర్నర్ ఎందుకు వెనకాడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, రాష్ట్రంలో గవర్నర్ పాలన కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని విశాల్ డిమాండ్ చేశారు. విజయ్ కచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఒక ఓటరుగా తాను అదే కోరుకుంటున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని, ఈ విషయంలో రాజ్యాంగపరమైన హక్కులను గౌరవించాలని ఆయన కోరారు.