‘మేము స్టూవర్ట్‌పురం ప్రాంతంలోనే పుట్టిపెరిగాం. చిన్నప్పట్నుంచీ ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి కథలుకథలుగా విన్నాం. ఆ విధంగా ఈ కథతో మాకు కాస్త దగ్గర సంబంధం ఉంది. నాగేశ్వరరావు అంటేనే సాహసం. ఆయన చేసినవన్నీ ఊహకందని సాహసాలే. అవన్నీ ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఉపయోగపడ్డాయి. నిజంగా ఆ పాత్రకు రవితేజ సరిగ్గా సరిపోయారు’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్. రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు.
ఆయన రియల్ హీరో
‘టైగర్ నాగేశ్వరరావు’ ఓ రాబిన్‌హుడ్. ఉన్నోళ్లను కొట్టి లేనోళ్లకి పెట్టడం ఆయన ైస్టెల్. ఆయనకు స్వయంగా పోలీసులే ‘టైగర్’ అనే బిరుదు ఇచ్చారు. తాడిచెట్టంత ఎత్తులో ఉండే చెన్నయ్ జైలు గోడ ఈజీగా దూకి పారిపోయాడంట నాగేశ్వర్రావ్. మేం పోరాటలు చిత్రీకరించేటప్పుడు రోప్ వాడతాం. బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది ఏ సాయం లేకుండా అంతఎత్తు గోడ ఎక్కగలిగాడంటే, అంతకంటే ఆశ్చర్యం ఉంటుందా? నిజంగా ఈ సినిమా మేం చెయ్యడం ఫైట్ మాస్టర్లుగా మాకు సాహసమే. అందుకే ఇందులో ఫైట్లన్నీ రియలిస్టిక్‌గా కంపోజ్ చేశాం. ఇందులోని ప్రతి ఫైట్‌ను ప్రేక్షకులు రియల్‌గా ఫీలవుతారు.