Fauzi OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొల్పిన ఈ చిత్రం, ఇప్పుడు రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా సౌత్ ఇండియన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు రూ.180 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో హిందీ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిలింస్ రూ.60 కోట్లకు పైగా చెల్లించి దక్కించుకున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ ఒప్పందాలపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్తలు ట్రేడ్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. హిందీ డిజిటల్ హక్కులతో పాటు శాటిలైట్, ఆడియో రైట్స్‌కు సంబంధించిన ఒప్పందాలు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అవి కూడా పూర్తయితే, ‘ఫౌజీ’ విడుదలకు ముందే భారీ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సీతారామం’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని 1930ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, యుద్ధ వాతావరణం, దేశభక్తి అంశాలను ప్రధానంగా తీసుకుని కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, స్పై థ్రిల్లర్ అంశాలు కూడా కథలో కీలకంగా ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఇమాన్వీ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు భారతీయ ప్రేక్షకులు చూడని కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమని, హను రాఘవపూడి ఎంతో విభిన్నమైన స్థాయిలో ఈ కథను తెరకెక్కిస్తున్నారని చెప్పారు. అన్ని పనులు అనుకున్న ప్రకారం పూర్తయితే డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.