Faria Abdullah | ‘జాతిరత్నాలు’తో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్దుల్లా పేరు చెబితే ఇప్పటికీ చాలామందికి చిట్టి పాత్రే గుర్తొస్తుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ ఊహించినంత వేగంగా ముందుకెళ్లకపోయినా, ఫరియా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే వెండితెరపై బ్రేక్ లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివిటీ ఎప్పుడూ తగ్గలేదు. గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు దగ్గరగానే ఉంటూ తన పాపులారిటీని కంటిన్యూ చేస్తోంది.
ఇప్పటికే తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘భగవంతుడు’ సినిమా టీజర్ విడుదల కావడంతో ఫరియా మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ టీజర్లో ఆమె లుక్, పాత్ర డిజైన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఒకవైపు సంప్రదాయ పల్లెటూరి అమ్మాయిలా లంగా ఓణీలో కనిపిస్తూనే, మరోవైపు కథ డిమాండ్ మేరకు బోల్డ్ షేడ్స్ ఉన్న సీన్స్‌లోనూ ఆమె కనిపించడం హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్ షాట్, చివర్లో రౌడీలకు ఎదురెళ్లే ధీటైన ఎక్స్ప్రెషన్స్ చూస్తే, ఫరియాను ఇప్పటివరకు చూసిన ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా చూపించారని చెప్పొచ్చు.కంటెంట్ బలంగా ఉంటే గ్లామర్ రోల్స్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫరియా ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అదే మాటకు తగ్గట్టుగానే ఈ పీరియడ్ రూరల్ డ్రామాలో ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.
గ్లామర్‌ను మాత్రమే కాకుండా, ఎమోషన్, ఆగ్రహం, అమాయకత్వం అన్నీ కలిపిన పాత్రగా ఇది కనిపిస్తోంది. మరీ అతిగా కాకుండా కథకు అవసరమైనంత వరకే బోల్డ్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.‘జాతిరత్నాలు’ తర్వాత సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫరియాకు ‘భగవంతుడు’ కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమెకు నటన పరంగా కూడా మంచి స్కోప్ ఉన్నట్టు టీజర్ స్పష్టంగా చెబుతోంది. ఒకవైపు పల్లెటూరి అమ్మాయి అమాయకత్వం, మరోవైపు ధైర్యంగా నిలబడే మహిళగా ఆమె చూపించబోయే షేడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.జిజి విహారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఫరియా మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. టీజర్‌తో అయితే సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో ఫోటోలతో మ్యాజిక్ చేస్తున్న చిట్టి, ఈసారి వెండితెరపై కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.