చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలన్నది అతని కోరిక. చివరకు ఎట్లాగో అమెరికాలో అడుగుపెడతాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్ ఆపరేషన్ అతనికి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ యువకుడి అమెరికా డ్రీమ్స్ ఏమయ్యాయే తెలుసుకోవాలంటే మా ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. తరుణ్‌భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కాశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ వేసవిలో విడుదలకానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, అమెరికా వీసా కష్టాలను ఆవిష్కరిస్తుందని తరుణ్‌భాస్కర్ తెలిపారు. లాఫ్ రైడ్‌లా సినిమా సాగుతుందని ఫరియా అబ్దుల్లా చెప్పింది. వినోదంతో పాటు సందేశం కలబోసిన చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ ఆగస్తీ, నిర్మాణం: సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్, రచన-దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్.