అక్కినేని నాగార్జున, నాగచైతన్యలతో కలిసి స్టెప్పులేసింది యువనాయిక ఫరియా అబ్దుల్లా. ‘బంగార్రాజు’ చిత్రంలో ఆమె ప్రత్యేక గీతంలో నటించింది. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని మూడో పాటను ఈ నెల 17న విడుదలచేయబోతున్నారు. ఈ ప్రత్యేక గీతంలో నాగార్జున, నాగచైతన్యలతో కలిసి ఫరియా అబ్దుల్లా తళుక్కున మెరిసింది. ఈ పాట తాలూకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున పంచెకట్టులో కనిపించగా, నాగచైతన్య ఆధునిక దుస్తుల్లో దర్శనమిచ్చారు. “సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. ప్రత్యేకగీతానికి ఫరియా అబ్దుల్లా నృత్యాలు, గ్లామర్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది’ అని చిత్రబృందం తెలిపింది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్.