డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్‌శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రధారులుగా, మహేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథాచిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్ఎం మురళి(గోదావరి కిట్టయ్య) నిర్మాతలు. మే 1న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్‌చంద్ర మాట్లాడుతూ ‘ప్రేమ, సునిశిత హాస్యం, భావోద్వేగాల కలబోత ఈ సినిమా. తప్పటడుగులు వేయడం వల్ల యువతరం ఏం కోల్పోతుందో హెచ్చరించే సినిమా ఇది. అటు పెద్దలకూ, ఇటు పిల్లలకూ సందేశం ఈ సినిమా. మన చుట్టూ కనిపించే సహజమైన పాత్రలే ఇందులో కనిపిస్తాయి. నా కెరీర్లో ‘ప్రేయసిరావే’ తర్వాత ఈ సినిమా మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కథ: ఆకుల సురేశ్ పటేల్, మాటలు: శ్రీరామ్ ఏదోటి, సంగీతం: జీసి క్రిష్.