Aparadhi | పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఆయన నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటించిన మలయాళ చిత్రం “ఇరుల్” ఇప్పుడు తెలుగులో రానుంది. మిస్టరీ హారర్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా కేరళలో 2021 విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత తెలుగులో విడుదల కానుంది. “అపరాధి” పేరుతో ఆహా ఓటీటీలో ఈ నెల 8వ తేదీ (గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంజుమ్మెల్ బాయ్స్ స్టార్ సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ఒక ప్రేమ కథలోకి సీరియల్ కిల్లర్ ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే కోణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా నిడివి కేవలం 91 నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం. కొవిడ్ సమయంలో కావడంతో థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. అప్పుడు కేవలం మలయాళ వెర్షన్లో మాత్రమే ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఆ సమయంలో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలోకి వస్తుంది.