బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన రణ్‌వీర్‌సింగ్ ప్రస్తుతం అబుదాబిలో ఎఫ్-1 రేస్‌లను వీక్షిస్తూ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఆయనకు అక్కడ ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. మార్టిన్ బ్రూండెల్ అనే మాజీ రేసర్ రణ్‌వీర్‌సింగ్‌ను ‘నువ్వు ఎవరు’ అని ప్రశ్నించారు. దాంతో తొలుత కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసిన రణ్వీర్ వెంటనే అతని ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
తాను బాలీవుడ్ నటుడినని, ముంబయిలో ఉంటానని చెప్పాడు. అంతటితో ఆగకుండా తాను ధరించిన దుస్తుల్ని కూడా అద్దెకు తీసుకున్నానని, వెళ్లేముందు వాటిని తిరిగి ఇచ్చేయాలి అంటూ సరదాగా ఓ జోక్ పేల్చాడు. దీంతో ఆ మాజీ రేసర్ కూడా నవ్వాపుకోలేకపోయాడు. వీరిద్దరి మధ్య సంభాషణ తాలూకూ వీడియోను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. రణ్‌వీర్‌సింగ్ హాస్యచతురత బాగుందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.