చుట్టూ బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం! మధ్యలో ఓ ద్వీపం! అస్సామీ సంస్కృతి-సంప్రదాయాలకు ఇది ఆలవాలం. ప్రకృతితో మమేకమై జీవించే గిరిజన జీవన విధానాన్నికండ్లకు కట్టే ఒక అద్భుతమైన ప్రదేశం.. మాజులీ గ్రామం! అసోం ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ సాక్ష్యం!
అసోం రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక గ్రామం మాజులీ. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఇది. కేవలం ఒక గ్రామంగానే కాదు.. అసోం సాంస్కృతిక రాజధానిగానూ గుర్తింపు పొందింది. దక్షిణాన బ్రహ్మపుత్ర నది, ఉత్తరాన సుబన్సిరి నది, ఖేర్కుటియా క్సుతి అనే బ్రహ్మపుత్ర ఉపనది మధ్యలో ఈ ద్వీపం ఏర్పడింది. 2016లోనే మాజులీ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. దేశంలోనే తొలి నదీ ద్వీప జిల్లాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద నివాసిత నదీ ద్వీపంగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించింది.

సత్రాలు.. సాంస్కృతిక కేంద్రాలు
15వ శతాబ్దంలో ప్రముఖ వైష్ణవ సంస్కర్త, కవి శ్రీమంత శంకరదేవ ప్రారంభించిన నవ-వైష్ణవ ఉద్యమానికి మాజులీ ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడి వైష్ణవ మఠాలను ‘సత్రాలు’ అని పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ 65కి పైగా సత్రాలు ఉండగా, ప్రస్తుతం సుమారు 30 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి అసోం సంస్కృతి-సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఇక్కడి కమలాబారి సత్రం.. శాస్త్రీయ సంగీతం, నృత్యం, సాంస్కృతిక శిక్షణకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఉత్తర కమలాబారి సత్రంలో శిక్షణ పొందిన కళాకారులు.. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పురాతన అస్సామీ శిల్పాలు, వస్తువులు, సంప్రదాయ ఆభరణాలకు.. ఔనియాటి సత్రం ప్రసిద్ధి చెందింది. శ్యామగురి సత్రంలో చేతితో తయారయ్యే సంప్రదాయ ముసుగులు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. రాసలీలలు, నాటకాలలో వీటి వినియోగం తప్పనిసరి.
విభిన్నతే వీరి ప్రత్యేకత..
ద్వీప గ్రామమైన మాజులీలో వరదల తాకిడి ఎక్కువ. అందుకే, ఇక్కడి ఇండ్ల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. నేలపై కాకుండా.. వెదురు కర్రలతో ఎత్తుగా బేస్మెంట్ నిర్మించి, వాటిపై ఇండ్లు కట్టుకుంటారు. ఈ నివాసాలు వరదల నుంచి రక్షణ కల్పించడమే కాదు.. గ్రామాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఇక చేనేత వస్ర్తాలు, వెదురు కళాకృతులు, కుండల తయారీ గ్రామీణుల ప్రధాన వృత్తులు. గ్రామాన్ని సందర్శించేవాళ్లంతా వీటిని తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. మాజులీలో మరో ప్రత్యేకత.. సేంద్రియ వ్యవసాయం. ఎలాంటి రసాయనాలు వాడకుండా.. పంటలు పండిస్తారు.

పండుగల సందడి..
మాజులీలో అడుగడుగునా గిరిజన సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ మిషింగ్ తెగ వాసులు ఎక్కువగా ఉంటారు. ఫిబ్రవరిలో వ్యవసాయ పండుగ ఆలీ-ఐ-లిగాంగ్ను జరుపుకొంటారు. ఇక కార్తిక పౌర్ణమి (నవంబర్) సమయంలో ఇక్కడ జరిగే ‘రాస్ లీల’ ఉత్సవం మరో ప్రధాన ఆకర్షణ. ఈ సందర్భంగా నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు.
వలస పక్షులకు నెలవు..
అందమైన ప్రకృతి ఒడిలో అలరారే మాజులీ గ్రామం.. పక్షి ప్రేమికులకు స్వర్గధామం కూడా! ఏటా శీతాకాలంలో వందల సంఖ్యలో పెలికాన్లు, సైబీరియన్ కొంగలు లాంటి అనేక పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. స్థానిక చిత్తడి నేలల్లో సందడి చేస్తుంటాయి. వీటిని చూడటానికి, కెమెరాల్లో బంధించడానికి టూరిస్టులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు కూడా ఇక్కడ వాలిపోతుంటారు.
ఎలా వెళ్లాలి?
మాజులీకి సమీప పట్టణం జోర్హాట్. ఇక్కడికి దగ్గరలోని నిమతి ఘాట్ నుంచి మజులికి ఫెర్రీలు (పడవలు) నడుస్తాయి. బ్రహ్మపుత్ర నదిపై దాదాపు గంటన్నర ప్రయాణిస్తే.. మాజులీకి చేరుకోవచ్చు. ఇక అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.