రివ్యూ: ఈటి
తారాగణం: సూర్య, ప్రియాంక అరుళ్మోహన్, సత్యరాజ్, శరణ్య, పొన్వణ్ణన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
సంగీతం: డి. ఇమ్మాన్
దర్శకత్వం: పాండిరాజ్
తెలుగు రిలీజ్: ఏషియన్ మల్టీప్లెక్స్
సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ చిత్రాలు లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికల్లో విడుదలై మంచి విజయాల్ని దక్కించుకున్నాయి. ‘జై భీమ్’ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించుకోవడంతో సూర్యకు అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఈ రెండు సినిమాలు ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ కావడంతో ఆయన థియేటర్ రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ‘ఈటి’ (తమిళంలో ‘ఎతార్కుమ్ తునిందవాన్’) సినిమాతో సూర్య ప్రేక్షకుల ముందుకొచ్చారు. సమకాలీన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చిస్తూ ఈ సినిమాను రూపొందించామని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పడం.. ట్రైలర్ సైతం సూర్య శైలి మాస్ అంశాలతో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న సూర్య ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారో లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథేమిటంటే…
దక్షిణాపురం అనే టౌన్లో ఆడపిల్ల జన్మిస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏటా మహిళా ఉత్సవం నిర్వహిస్తూ ఆడబిడ్డల్ని గౌరవిస్తుంటారు. అదే ఊరికి చెందిన యువ న్యాయవాదే కృష్ణమోహన్ (సూర్య). తొమ్మిదేళ్ల వయసులోనే తన చెల్లి కామాంధుల కర్కశత్వానికి బలై పోవడంతో.. మహిళలు అంటే గొప్ప గౌరవభావం కలిగి ఉండటంతో పాటు వారికి ఎలాంటి సమస్య వచ్చినా చలించిపోతాడు. ఇదిలావుండగా దక్షిణాపురం టౌన్లో కొందరమ్మాయిలు వరుసగా ఆత్మహత్యకు పాల్పడటం.. ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంటుంది. ఈ సంఘటనల వెనకున్నది ఎవరు? వాటిని ఛేదించే క్రమంలో కృష్ణమోహన్ తెలుసుకున్న నిజాలేమిటి? ఈ కీచకపర్వాన్ని అంతమొందించడానికి యువ లాయర్ ఏ రీతిలో పోరాటం చేశాడు? ఎలాంటి వ్యూహాలు అమలు చేశాడు? అన్నదే మిగతా చిత్ర కథ..
ఎలా ఉందంటే…
ప్రస్తుత సమాజంలో మహిళలు అనేక రకాలైన వేధింపులకు గురవుతున్నారు. అసాంఘిక శక్తుల ట్రాప్‌లో చిక్కుకొని విలువైన జీవితాల్ని బలిచేసుకుంటున్నారు. వారు ఎదుర్కొనే కొన్ని సమస్యలు తమ కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని విధంగా ఉంటాయి. ఇలాంటి బలమైన సామాజిక స్పృహ కలబోసిన అంశాలతో దర్శకుడు పాండిరాజ్ ఈ కథను రాసుకున్నాడు. అయితే ఓ లైన్లా గొప్పగా అనిపించే ఈ కథను తెరపై తీసుకొచ్చే క్రమంలో మాత్రం పూర్తిగా పట్టుతప్పాడు. ప్రథమార్థాన్ని కృష్ణమోహన్, అధిరా (ప్రియాంక అరుళ్మోహన్) మధ్య ప్రేమాయణం.. వారి పెళ్లి ఘట్టానికి దారితీసే పరిస్థితుల నేపథ్యంలో నడిపించారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో వినోద ప్రధానంగా తీర్చిదిద్దారు. అయితే తమిళ ఛాయలతో సాగే ఆ సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి. కామెడీ ఏమాత్రం నవ్వు తెప్పించదు. చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ప్రమాదంలో చనిపోయిన ఓ అమ్మాయి కేసును ఛేదించే క్రమంలో లాయర్ కృష్ణమోహన్ అసాంఘిక శక్తులెవరో తెలుసుకుంటాడు. అక్కడి నుంచే కథ కాస్త సీరియస్ మలుపు తీసుకుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను యాక్షన్ ఎలివేషన్స్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
నిందితులెవరూ తెలుసుకున్నాక.. వారిని అంతమొందించడం కోసం కృష్ణమోహన్ చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ సాగింది. క్లెమాక్స్ ఘట్టం సాగతీతగా అనిపించినా.. అందులో కొన్ని డైలాగ్స్ ఆలోచనల్ని రేకెత్తించేలా అనిపిస్తాయి. అందరూ ఊహించినట్లుగానే ముగింపు ఉంటుంది. ఈ సినిమా ద్వారా ఓ సీరియస్ అంశాన్ని చర్చించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం అభినందనీయమే. ఈ క్రమంలో కథలో అనవసరమైన కమర్షియల్ అంశాల్ని.. కామెడీని మిక్స్ చేసి సినిమా మొత్తం కలగాపులగం చేశారనే భావన కలుగుతుంది. ముఖ్యంగా పక్కా తమిళ నేటివిటీతో సాగే కొన్ని సన్నివేశాలతో తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం కనెక్ట్ కాలేరు. అలాకాకుంవడా ఓ లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్‌గా ఈ కథను చెబితే బాగుండేదనిపిస్తుంది. కథకుడిగా, దర్శకుడిగా పాండిరాజ్ ఈ సినిమా విషయంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పొచ్చు. సీరియస్ కథకు ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామెడీ హంగులు జోడించిన దర్శకుడి ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు.
ఎవరెలా చేశారంటే..
సూర్య అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భిన్న పార్శాల్లో సాగిన ఆయన నటన ఆకట్టుకుంటుంది. తనలోని మాస్ యాంగిల్‌ను మరోసారి ఈ సినిమా ద్వారా రుజువు చేశారు సూర్య. ప్రియాంక అరుళ్మోహన్కు మంచి పాత్ర దక్కింది. ఆమె అందంగా కనిపించడంతో పాటు క్లెమాక్స్ సన్నివేశాల్లో చక్కటి నటనతో మెప్పించింది. శరణ్య, సత్యరాజ్ తమ పాత్రల పరిధుల మేరకు న్యాయం చేశారు. వినయ్‌రాయ్ విలన్‌గా ఫర్వాలేదనిపించాడు. ఇక సంగీతపరంగా పాటలు అంతంతమాత్రమే అనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. కొన్ని ఎలివేషన్ సీన్స్‌కు బీజీఎమ్ ఊపు తీసుకొచ్చింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. ఆరంభ సన్నివేశాల్లో గ్రామీణ సౌందర్యాన్ని గొప్పగా ఒడిసిపట్టింది.
తీర్పు:
సూర్య నటనను అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది కానీ కథాపరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సూర్య తాలూకు కొన్ని మాస్ ఎలివేషన్స్.. యాక్షన్ ఘట్టాలు తప్ప అంతగా ఆకట్టుకునే అంశాలు లేవనిపిస్తుంది.
రేటింగ్: 2.5/5