Anil Ravipudi | దర్శకుడిగా పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు అనిల్ రావిపూడి. ‘పటాస్’తో శ్రీకారం చుట్టి ప్రస్తుతం ‘సంక్రాంతి వస్తున్నాం’ వరకు వచ్చారు. ఈ పదేళ్లకాలంలో ఆయన ఎనిమిది సినిమాలను డైరెక్ట్ చేయగా.. అవన్నీ సూపర్‌హిట్స్ కావడం విశేషం. తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండొందల కోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరడంతో దర్శకుడిగా ఆయన మరో మైలురాయిని చేరుకున్నైట్లెంది. ఈ నేపథ్యంలో బుధవారం దర్శకుడు అనిల్ రావిపూడి పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అపూర్వ విజయంతో పాటు తన పదేళ్ల సినీ ప్రయాణం గురించి అనేక సంగతులను పంచుకున్నారు..
ప్రేక్షకుల మద్దతుతో ఈ పదేళ్లలో అన్నీ సక్సెస్‌లే చూశాను. ఏ జోనర్ సినిమా చేసినా వారు నన్ను ఆదరించారు. నా విజయాల తాలూకు గొప్పదనమంతా ప్రేక్షకులదే. ఇక నా కెరీర్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ ఓ అద్భుతం. వారం రోజుల్లో 200కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. నా కెరీర్లోనే ఈ సినిమా ఒక హిస్టరీ.
ప్రేక్షకులకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలను డైరెక్ట్ చేయడం మరపురాని గొప్ప అనుభవం. కల్యాణ్‌రామ్ ‘పటాస్’తో దర్శకుడిగా అవకాశమిచ్చారు. ఆయన లేకపోతే నా కెరీర్ లేదు. ఆ పదేళ్లలో సాయిధరమ్‌తేజ్, రవితేజ, వెంకటేష్, మహేష్‌బాబు వంటి స్టార్లతో సినిమాలు చేశా. ఈ ప్రయాణంలో వారందరితో వ్యక్తిగతంగా గొప్ప అనుబంధం ఏర్పడింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు లభిస్తున్న ప్రశంసలు ఆనందాన్నిస్తున్నాయి. ‘మా అమ్మ ముప్పైఏళ్ల తర్వాత సినిమాకు వచ్చింది’ అని ఓ ఫ్రెండ్ ఫొటో షేర్ చేశాడు. కొంతమంది వృద్ధులు వీల్‌చైర్‌లో వచ్చి మరి సినిమా చూశామని చెబుతున్నారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు వున్న బలం. నా బలం కూడా ఈ జోనరే. దర్శకుడిగా వినోదమే నా ఆయుధం.
చిరంజీవిగారితో చేయబోయే సినిమా గురించి ఇప్పుడే మాట్లాడలేను. ఎలాంటి జోనర్లో సినిమా చేయాలనే విషయం మీద మా టీమ్ కసరత్తులు చేస్తున్నది. అందరూ ఊహించినదానికంటే గొప్పగా చిరంజీవిగారిని కొత్త పంథాలో ప్రజెంట్ చేయాలనే సంకల్పంతో ఉన్నాం. నేను చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు చూస్తూ పెరిగాను. నా దృష్టిలో వారు ఫోర్పిల్లర్స్. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణతో సినిమాలు చేశా. చిరంజీవిగారితో ప్రాజెక్ట్ ఓకే అయింది. భవిష్యత్తులో నాగార్జునగారితో తప్పకుండా సినిమా చేస్తా. ఆయనతో ‘హలో బ్రదర్’లాంటి సినిమా చేయాలనుంది. అది పూర్తయితే నేను సినిమాలు చూస్తూ పెరిగిన ఫోర్పిల్లర్స్తో పని చేశాననే రికార్డు కూడా ఉంటుంది.