English Titles | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఏంటీ? దర్శకులకు తెలుగు పేర్లు దొరకడం లేదా? లేదంటే హాలీవుడ్ ఎటైర్ తీసుకురావడానికి ఇలా చేస్తున్నారా? ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కామెంట్స్ ఇవే. ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం అనేది కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. గత రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నో తెలుగు సినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్‌తో రిలీజయ్యాయి. అయితే తరచూ పలికే పదాలైతే ఓకే కానీ, ఎప్పుడో కానీ పలకని పదాలు, అసలు తెలియని పదాలను టైటిల్స్‌గా పెట్టడం సినిమాకు ఒకింత మైనస్ అనే చెప్పాలి. అంతేకాకుండా గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టిన సినిమాలు విజయాలు సాధించినవి చాలా తక్కువే ఉన్నాయి.
కాగా తాజాగా అలా ఇంగ్లీష్ టైటిల్స్ వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలు సాధించాయి. జనవరి చివరివారంలో విడదలైన హంట్ మూవీ, ఫిబ్రవరి రెండో వారంలో రిలీజైన అమిగోస్ రెండు ఇంగ్లీష్ టైటిల్స్‌తో వచ్చి పరాజయాన్ని చవిచూశాయి. నిజానికి ఈ రెండు సినిమాల పరాజయాలకు కారణం మేయిన్‌గా ఇంగ్లీష్ టైటిల్స్ అనే చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఒక సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చేది మేయిన్ టైటిలే. అలాంటి టైటిల్‌నే మనం వాడని పదాలు తీసుకొచ్చి పెడితే సినిమాపై బజ్ కాదు కదా.. సగం మందికి రీచ్ కూడా అవ్వదు.
టీజర్, ట్రైలర్లకు ఎన్ని లక్షల వ్యూస్ వచ్చినా.. సగటు ప్రేక్షకుడు టైటిల్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలకు వెళ్తుంటారు. ఈ రెండనే కాదు గతేడాది వచ్చిన రౌడీ బాయ్స్, గుడ్‌లక్ సఖీ, సన్ ఆఫ్ ఇండియా, స్టాండ్ అప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, ఫన్ అండ్ ఫ్రస్టేషన్, గాడ్సే, ది వారియర్, థాంక్యూ, లైగర్, ది గోస్ట్, గాడ్‌ఫాదర్ ఇలా చాలా వరకు ఇంగ్లీష్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ ఫేయిల్యూర్స్గా మిగిలాయి. అయితే ఆర్ఆర్ఆర్, డీజే టిల్లు, మేజర్, హిట్ వంటి పలు సినిమాలు మంచి విజయాలు కూడా సాధించాయి. కానీ మేజర్‌గా ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే అన్ని సినిమాల విషయంలో ఇది జరుగుతుందని చెప్పలేం. కానీ అదృష్టం బాలేకపోతే టైటిలే సినిమాకు ఉరితాడు అయ్యే చాన్స్ ఉంది.
అయితే కొందరు మాత్రం అలా ఏంకాదని, కంటెంట్, దానికి తగ్గ అవుట్ పుట్ ఉంటే టైటిల్‌ను లెక్కచేయకుండా సినిమాలు చూస్తారని అంటున్నారు. ఏదేమైనా దర్శక నిర్మాతలు ఇంగ్లీష్ టైటిల్స్ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించడం బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.