‘బుధవారం ‘సత్యభామ’ ప్రీమియర్ వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల చేస్తున్నాం. పోలీస్ స్టోరీస్ గతంలో ఎన్నో వచ్చాయి. అయితే ఎమోషనల్‌గా ‘సత్యభామ’ మాత్రం స్పెషల్. నేటి ఆడియన్స్‌కు నచ్చేలా ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్‌తో ‘సత్యభామ’ ఉండబోతున్నది.’ అన్నారు చిత్ర స్క్రీన్‌ప్లే రైటర్ శశికిరణ్ తిక్క.
ఆయన సమర్పకుడిగా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రతో రూపొందిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా స్క్రీన్‌ప్లే రైటర్ శశికిరణ్ తిక్క విలేకరులతో ముచ్చటించారు.
‘యూకేలోని నా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన కథతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. ఆ పాయింట్ నచ్చి, నేను, దర్శకుడు సుమన్ చిక్కాల కలిసి ఈ కథ తయారు చేశాం. అప్పుడు ‘మేజర్’ షూటింగ్ జరుగుతున్నది. ఆ సినిమా పూర్తయ్యాక, ఈ సినిమాను సెట్స్‌కి ఎక్కించాలనుకున్నాం. కాజల్‌కి ముందు కథ వినిపించాం.
ఆమె విపరీతంగా నచ్చింది. అలా ప్రాజెక్ట్ స్టార్టయ్యింది’ అని తెలిపారు శశికిరణ్ తిక్క. స్వతహాగా దర్శకుడ్నయిన తాను, ఈ సినిమాతో నిర్మాతగా కూడా అనుభవం పొందగలిగానని, చిత్ర సమర్పకుడిగా సినిమా మేకింగ్‌లో కూడా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకున్నానని శశికిరణ్ తెలిపారు. కాజల్ గురించి చెబుతూ ‘ కాజల్ అలిసిపోవడం నేను చూడలేదు. షూటింగ్ టైమ్‌లో తన ఎనర్జీ మా అందరిలో ఉత్సాహం నింపేది. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా చేసింది.’ అని తెలిపారు. ఇది రెగ్యులర్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ కాదని, ఎమోషన్స్‌తో కూడుకున్న ఇన్విస్టిగేటివ్ డ్రామా అనీ శశికిరణ్ తిక్కా చెప్పారు.