‘ ‘ఈషా’ ఓ వండర్ఫుల్ మూవీ. తొలి పది నిమిషాల్లోనే ఈ సినిమాను మేం ఎందుకు విడుదల చేశామో మీకు అర్థమైపోతుంది. ఆసక్తి, భయం మేళవింపు ఈ సినిమా. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే హారర్ థ్రిల్లర్ ఇది. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మా గత చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది’ అని నిర్మాత వంశీ నందిపాటి అన్నారు. బన్నీ వాస్‌తో కలిసి ఆయన విడుదల చేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రధారులు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈచిత్రాన్ని విడుదల చేస్తున్న వంశీ నందిపాటి, బన్నీవాస్ ఆదివారం విలేకరులతో ముచ్చటించారు. ‘కంటెంట్ నచ్చితేనే మేం విడుదల చేస్తాం.
నచ్చకపోతే వెంటనే వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గం చెబుతాం. కంటెంట్ మీద నమ్మకంతోనే మేమిద్దరం కలిశాం. నా సొంత సినిమాలు ఫెయిలైన దాఖలాలు ఉన్నాయి కానీ, నేను పంపిణీ చేసిన సినిమాలు ఇప్పటివరకూ ఫెయిల్ కాలేదు. ఈ సినిమా విషయంలోనూ ఫెయిల్ కాను అని నమ్మకంతో ఉన్నా. ఈ సినిమా ఫస్ట్‌కాపీ చూసి తీసుకున్నాం. ఆడియన్స్ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది.’ అని నిర్మాత బన్నీవాస్ అన్నారు. తాము రిలీజ్ చేసే సినిమాలపై ఎడిట్ రూమ్ నుంచే తమ ప్రమేయం ఉంటుందని, నేపథ్య సంగీతం, ఎడిటింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ మార్పులు, చేర్పులు చేసి, నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను కూడా క్లోజ్ చేసి ఓ ప్లాన్ ప్రకారం సినిమాను విడుదల చేస్తామని, ఇదో కొత్త ట్రెండ్ అని వంశీ నందిపాటి తెలిపారు.