Raana Daggubati | ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న వారిలో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి జూలై 23న విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే ముందస్తు కార్యక్రమాలు, సినిమా షూటింగ్ కారణంగా బుధవారం విచారణకు రాలేనని ఈ విచారణకు సంబంధించి మరో తేదీ కావాలని సినీ నటుడు రానా దగ్గుబాటి కోరారు. అయితే దీనిపై తాజాగా ఈడీ రానాకు మరోసారి నోటీసులు పంపింది. ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలంటూ తెలిపింది. మరోవైపు నటులు ప్రకాశ్‌రాజ్ ఈ నెల 30న, విజయ్‌దేవరకొండ ఆగస్టు 6న, మంచులక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతోంది. ఈ యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసులు నమోదు చేసింది.