Dulquer Slamaan | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దుల్కర్. తొలి సినిమాతోనే తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. జెమినీ గణేషన్‌గా నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ఇక కరోనా సమయంలో ఓటీటీల పుణ్యమా అని ఆయన నటించిన మలయాళ సినిమాలను మనవాళ్లు సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరీ చూశారు.’బెంగళూర్ డేస్’, ‘చార్లీ’, ‘ఉస్తాద్ హోటల్’, ‘చుప్’ ఇలా చాలా వరకు సినిమాలు చూసేశారు. ఇక గతేడాది విడుదలైన ‘సీతారామం’తో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక దాంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఎంతో ప్రయత్నిస్తున్నారు.
కాగా తాజాగా దుల్కర్ ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలే ‘సార్’తో ధనుష్‌ను వంద కోట్ల క్లబ్లో నిలబెట్టిన వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడట. ఇక ఈ సినిమాను సితార బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నాడని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కొత’ అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను సల్మాన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.