Sita Ramam Teaser Released | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన నటిస్తున్న తెలుగు చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ టీజర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
‘ఆకాశవాణి ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం’ అంటూ టీజర్ మెదలైంది. ‘లెఫ్టినెంట్ రామ్.. నిన్నే నాకు పరిచయమైన పేరు. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడాటానికి ఒక కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ అంటూ వచ్చే డైలాగ్స్ దుల్కర్ పాత్రను తెలుపుతున్నాయి. అంతలో ఓ లేఖ రావడం, దానికి దుల్కర్ ఆశ్చర్యంగా నాకా అని లేఖను ఓపెన్ చేయడం ఆకట్టుకుంటున్నాయి. ‘డియర్ రామ్ నీకు ఎవరు లేరా.. ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చున్నావయ్యా కొత్తగా, ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్. నిన్నే గుర్తుచేసుకుంటూ నీ భార్య సీతామహాలక్ష్మీ’ అంటూ మృనాళ్ సంభాషణలు అలరిస్తున్నాయి. ‘సీతా.. ఎవరు నువ్వు’ అంటూ దుల్కర్ డైలాగ్ క్యూరియాసిటీని పెంచుతుంది. విశాల్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. వినోద్ కెమెరా విజువల్స్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది.
ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది.