Dulquer Salmaan-Rana Daggubati Movie | ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దుల్కర్. ఆ తర్వాత ‘మహానటి’తో మన జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇక ‘సీతారామం’తో తెలుగులో సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు సమానంగా దుల్కర్ సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఉంది. దుల్కర్ కూడా నేరుగా తెలుగు దర్శకులతో చేతులు కలుపుతూ మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే వెంకీ అట్లూరితో తన కొత్త సినిమాను ప్రకటించాడు. సితార బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా దుల్కర్ మరో తెలుగు దర్శకుడితో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది.
నటుడు, హీరో రానా దగ్గుబాటి ‘స్పిరిట్’ మీడియా బ్యానర్ ను స్థాపించి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తువస్తున్నాడు. కాగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో గత కొన్నేళ్లుగా పనిచేస్తు్న్న ఓ యంగ్ టెక్నీషియన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇదే బ్యానర్లో దుల్కర్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఏ క్షణమైనా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం దుల్కర్ కింగ్ ఆఫ్ కోథ సినిమా చేస్తున్నాడు. అభిలాష్ ఎన్. చంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 24న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ మంచి హైపే క్రియేట్ చేశాయి. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది.