Shine Tom Chacko | ఒకవైపు నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కోంటున్న మలయాళం నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓక హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (DANSAF) బృందం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో రైడ్ చేసింది. అయితే, పోలీసులు రాకముందే ఆ హోటల్లో ఉన్న నటుడు షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మూడో అంతస్తులో ఉన్న షైన్, కిటికీ ద్వారా రెండో అంతస్తుకు దూకి, అక్కడి నుంచి మెట్ల మార్గంలో పరారైనట్లు సీసీటీవి ఫూటేజ్ ద్వారా తెలిసిందని పోలీసులు వెల్లడించారు. కాగా ప్రస్తుతం షైన్ టామ్ చాకో కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2015లో కూడా కొకైన్ తీసుకుని షైన్ టామ్ చాకో అరెస్ట్ అయినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు మూవీ సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ (Vincy Aloshious), షైన్ టామ్ చాకోపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సదరు నటుడిపై చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు చేసింది. ‘సూత్రవాక్యం’ (Suthravakyam) సినిమా సెట్లో నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( Kerala Film Chamber of Commerce), మలయాళ చిత్ర పరిశ్రమకు (Malayalam film industry) ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై తాజాగా నేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.