Mohanlal New Movie | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం 3’ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. బుధవారం సాయంత్రం విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో గత రెండు భాగాలకు సంబంధించిన కీలక ఘట్టాలను గుర్తు చేస్తూనే, మూడో భాగంపై భారీ అంచనాలను పెంచేశారు దర్శకుడు జీతూ జోసెఫ్. గతంలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అత్యంత ధైర్యంగా, ప్రశాంతంగా ఎత్తుగడలు వేసిన జార్జ్ కుట్టీ, ఈసారి మాత్రం తీవ్రమైన భయంలో కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “ఇప్పుడు నాకు భయంగా ఉంది సార్.. నన్ను ఇంకెవరో గమనిస్తున్నారని అనిపిస్తోంది” అంటూ మోహన్‌లాల్ చెప్పే డైలాగ్ ఈసారి కథలో ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని సూచిస్తోంది. ఈ టీజర్లో మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ తో పాటు ఆశా శరత్ వంటి పాత పాత్రలన్నీ కనిపించి సందడి చేశాయి.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్‌లాల్ పుట్టినరోజైన మే 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ మూడవ భాగంతోనే సెన్సేషనల్ సిరీస్‌కు ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇక మలయాళ టీజర్ రావడంతో తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించే రీమేక్ ఎప్పుడుంటుందా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగు రీమేక్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, మలయాళ వెర్షన్ విడుదలైన తర్వాత అక్కడ వచ్చే స్పందనను బట్టి రీమేక్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.