అస్సామీ సొగసరి కయాదు లోహర్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. అవన్నీ పెద్ద సినిమాలే. ఇప్పటివరకు కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ ఏదీ లేకున్నా.. అవకాశాల పరంగా మాత్రం దూసుపోతున్నదీ భామ. ఆకట్టుకునే స్క్రీన్‌ప్రజెన్స్, చలాకీతనం కలబోసిన నటనతో ఈ అమ్మడు యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
అదే భారీ ఆఫర్లకు కారణమని చెబుతున్నారు. తాజాగా ఆమె తమిళంలో మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది. అగ్ర హీరో సూర్య 48వ సినిమాలో కయాదు లోహర్ కీలక పాత్రకు ఎంపికైంది. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకుడు. పేదల పాలిట పెన్నిధిగా ప్రసి ద్ధికెక్కిన చెన్నై డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రోగుల వద్ద కేవలం ఐదు రూపాయల ఫీజు తీసుకునే ఈయన ‘ఐదు రూపాయల’ డాక్టర్‌గా ప్రజల మన్ననలు అందుకున్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ టీచర్ పాత్రలో కనిపించనుందని, కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. త్వరలో ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడనుంది.