Sharada | సినీరంగంలో నేటితరం మహిళల వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉంటున్నదని, పొట్టి దుస్తులను ధరిస్తూ శరీర భాగాలను ప్రదర్శించే ధోరణి ఎక్కువైపోయిందని సీనియర్ నటి, జాతీయ అవార్డు గ్రహీత శారద ఆవేదన వ్యక్తం చేసింది. మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగికపరమైన వేధింపులపై అధ్యయనం చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్‌లో శారద సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలే ఈ కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ తీవ్రంగా ఉందని, మహిళలు లైంగికపరంగా వేధింపులకు గురవుతున్నారని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో సినీరంగంలో మహిళల ప్రాతినిధ్యం గురించి కమిషన్‌కు శారద తన అభిప్రాయాలను వెల్లడించింది. సినీరంగంలో ఒకప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేదని, సెట్స్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎవరూ మాట్లాడేవారు కాదని, ఎలాంటి వేధింపులు ఉండేవి కావని శారద పేర్కొంది. పాశ్చాత్య సంస్కృతి వల్లే పెడధోరణులు ప్రబలుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాకు సంబంధించిన సాంకేతిక విద్యకు మహిళలు దూరంగా ఉండటమే మంచిదని, ప్రభుత్వాలు కూడా ఈ తరహా స్టడీస్ నుంచి మహిళలను మినహాయించాలని శారద సలహా ఇచ్చింది. ‘సినిమా టెక్నికల్ స్టడీస్ మహిళలకు సరిపడవు. చదువు మధ్యలో ఆపేసి వారు టెక్నికల్ అంశాల్లో శిక్షణ తీసుకుంటారు. అయితే సినీ రంగంలో జాబ్ గ్యారెంటీ ఏమీ ఉండదు. దాంతో వారి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది’ అని శారద వ్యాఖ్యానించింది.