Don Murray | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘బస్ స్టాప్’, ‘నాట్స్ ల్యాండింగ్’ చిత్రాల ఫేమ్ డాన్ ముర్రే (Don Murray) కన్నుమూశారు. 94 ఏళ్ల డాన్ ముర్రే అనారోగ్యంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక డాన్ ముర్రే మరణ వార్తతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1929 జూలై 31న లాస్ ఏంజెల్స్‌లో జన్మించిన డొనాల్డ్ పాట్రిక్ ముర్రే 1951లో తెరకెక్కిన ‘ది రోజ్ టాటూ’ అనే సినిమాతో చిన్న వయసులోనే హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాను నటించిన ‘బస్ స్టాప్’ సినిమా అయితే డాన్ ముర్రే సినీ జీవితంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో నటనకు గాను ముర్రే ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యాడు. ఒకప్పటి హాలీవుడ్ స్టార్ నటి మార్లిన్ మన్రో ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్ (1955), బ్యాచిలర్ పార్టీ (1957), ఎ హాట్‌ఫుల్ ఆఫ్ రెయిన్ (1957), షేక్ హ్యాండ్స్ విత్ ది డెవిల్ (1959), వన్ ఫుట్ ఇన్ హెల్ (1960), ది హుడ్లమ్ ప్రీస్ట్ (1961) ఇంకా దాదాపు 35కి పైగా హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ముర్రే నటనతో పాటు రచన, దర్శకత్వం, నిర్మాణ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.