Pathan 2 | బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ షారుక్ ఖాన్ (Sharukh Khan) పఠాన్ (Pathan) సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాపీస్‌ను షేక్ చేయడమే కాదు.. వరల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత గతేడాది జవాన్ సినిమాతో ఆడియెన్స్ ను పలుకరించి రికార్డులు సృష్టించాడు. అనంతరం రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీ సినిమాలో నటించగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చింది.
చాలా కాలం తర్వాత బాద్ షా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా పఠాన్‌ను స్టాండలోన్ ప్రాంఛైజీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్‌లో ఈ మూవీ రానుండగా.. ఈ బ్యానర్ లో రాబోయే 8వ ప్రాజెక్టు కానుంది. సిద్దార్థ్ ఆనంద్ కాకుండా సీక్వెల్‌కు కొత్త దర్శకుడు బాధ్యతలు తీసుకోనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఎక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3, వార్ 2, అలియాభట్ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ రానుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఫస్ట్ పార్టులో కనిపించిన దీపికాపదుకొనే సీక్వెల్ లో మరోసారి రా ఏజెంట్‌గా కనిపించనుందని టాక్. షారుక్ ఖాన్ ప్రస్తుతం సుజయ్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్న కింగ్‌లో నటిస్తున్నాడు. కింగ్ సిద్దార్థ్ ఆనంద్ ప్రొడక్షన్ వెంచర్ కావడం విశేషం. షారుక్ ఖాన్ కింగ్‌లో సుహానా ఖాన్ లీడ్ రోల్లో నటిస్తోంది.