టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జనసేన చీఫ్ పొలిటికల్ క్యాంపెయిన్ చేపట్టేందుకు సిద్ధం చేయించిన వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద పూజలు జరిపించిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కల్యాణ్ 17వ శతాబ్ధకాలం నాటి కథతో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే మొన్నటి దాకా వీరమల్లు గెటప్‌లో లాంగ్ హెయిర్‌తో ఉన్న పవన్ కల్యాణ్ మేకోవర్ (Makeover) మార్చేశాడు. పవన్ ఎవరూ ఊహించని విధంగా రెగ్యులర్ లుక్‌లో కనిపించేసరికి అభిమానులు ఒక్కసారిగా డైలమాలో పడిపోయారు.
అయితే పవన్ కల్యాణ్ కొత్త లుక్‌లో కనిపించడం వెనుక ఉన్న రహస్యం ఇదేనంటూ ఫిలింనగర్ సర్కిల్లో న్యూస్ రౌండప్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. యువ హీరో సాయిధరమ్ తేజ్‌తో రీమేక్ సినిమా చేసేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సముద్రఖని దర్శకత్వంలో రాబోతున్న వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్.
చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ జనవరి చివరలో మొదలవుతుందని, పవన్ కల్యాణ్ న్యూ లుక్ ఈ సినిమా కోసమేనని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందన్నమాట. పవన్ కల్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా సైన్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు.