Diwali Fight | టాలీవుడ్లో ఇటీవల వినిపిస్తున్న ఓ కామన్ డైలాగ్ .. “జనం థియేటర్లకు రావడం తగ్గించారు అని. టికెట్ ధరలు, స్నాక్స్ ఖర్చు, దూర ప్రయాణం వంటి అంశాల కారణంగా ప్రేక్షకులు సినిమా హాల్‌కు రావడంలో కాస్త వెనుకడుగేస్తున్నారని దర్శకులు, నిర్మాతలు వాపోతున్నారు. అయితే, ఇటీవలి బాక్సాఫీస్ విజయాలు మాత్రం ఈ అభిప్రాయాలని కొట్టిపాడేసాయి. మిరాయ్, కిష్కింధపూరి, లిటిల్ హార్ట్స్, OG సినిమాలు సెప్టెంబరు, అక్టోబర్ మధ్య థియేటర్స్‌లో విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. తెలుగు వెర్షన్లోనే ‘కాంతార: చాప్టర్ 1’ దసరా సమయానికి 70 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇవన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేశాయి . కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుడు ఖర్చు చేయడంలో వెనుకాడడు అని నిరూపించాయి.
అయితే ఈ దీపావళి వారానికి మాత్రం ప్రత్యేకత ఉంది. నవంబర్ 16-18 మధ్య నాలుగు సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. నవంబర్ 16 – మిత్రమండలి, నవంబర్ 17 – తెలుసు కదా, డూడ్ నవంబర్ 18 – కే ర్యాంప్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకే వారం నాలుగు సినిమాలు రావడం ప్రేక్షకులకు పండుగ కావచ్చు, కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఖర్చు. ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్‌లో సినిమాలకి డబ్బు పెట్టిన ప్రేక్షకుడు, దీపావళి సమయానికీ మళ్లీ ఖర్చు పెట్టగలడా? అన్నది అసలు ప్రశ్న. ఈ పండుగ బరిలో ఉన్న సినిమాలన్నీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశాయి.
‘తెలుసు కదా’ సున్నితమైన రొమాంటిక్ డ్రామా కాగా, ‘డూడ్’ తమిళ యూత్ ఫేవరెట్ డబ్బింగ్ మూవీ, ‘కే ర్యాంప్’ బోల్డ్ కామెడీ, ‘మిత్రమండలి’ ఫన్ & ఎమోషన్స్ మిక్స్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ నాలుగు సినిమాల్లో ప్రేక్షకులు ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తమ బడ్జెట్‌ను పక్కాగా లెక్క వేసుకుని, వినోదానికి ఎంత ఖర్చు పెట్టాలో నిర్ణయించుకుంటారు. ఈ బాక్సాఫీస్ బరిలో విజయం అందుకోవాలంటే, ఒక్కటి స్పష్టంగా ఉండాలి, అది మౌత్ టాక్. ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే పాజిటివ్ మౌత్ టాక్ రాబడితే, ఆ సినిమాకు థియేటర్లలో ఎక్కువ రన్ లభిస్తుంది. లేకపోతే, ఆ డబ్బుతో ప్రేక్షకులు షాపింగ్, వెకేషన్ లేదా OTT వైపు మొగ్గు చూపిస్తారు. చూడాలి మరి ఏ చిత్రానికి జనాలు ఎక్కువగా ఓటు వేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తారనేది.