Directors | సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు. కొందరు దర్శకుల దగ్గర మంచి కథలు ఉన్నా కూడా స్టార్ హీరోల డేట్స్ దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఒకవేళ దొరికిన కూడా ఏవో అవాంతరాలు వచ్చి ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు డైరెక్టర్స్ అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. వారిద్దరు ఎవరో కాదు హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి. వీరిద్దరికి అదృష్టం తలుపు తట్టింది. కాని ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీని దక్కించుకుంటే, క్రిష్ జాగర్లమూడి హరి హర వీరమల్లు ని తెరకెక్కించే ఛాన్స్ అందుకున్నారు.
పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు మొదలు పెట్టిన క్రిష్ ఈ సినిమాతో తన తలరాత మారిపోతుందని అనుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన షూటింగ్ పలు దఫాలగా వాయిదా పడుతూ వచ్చింది. క్రిష్ సహనాన్ని పవన్ చాలా పరీక్షించినట్టే అయింది. అయితే షూటింగ్ నిరవధికంగా వాయిదాపడుతూ రావడంతో ఫస్ట్ పార్ట్ తరువాత క్రిష్ చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ బాధ్యతల్ని నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకోవడం మనం చూశాం. హరిహర వీరమల్లు నుండి క్రిష్ తప్పుకొని అనుష్క కీలక పాత్రలో ఘాటీ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఇదే తరహాలో హరీష్ శంకర్ కూడా పవన్ కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ పెద్ద హిట్ కావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రంపై అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ హరీష్ శంకర్ కొంత వరకు పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, మిగతా భాగాన్ని తెరకెక్కించడానికి టైం సెట్ కావడం లేదు. ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ ఎక్కువగా ప్రజాపాలనపైనే దృష్టి పెట్టారు. దీంతో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ వెనక్కి వెనక్కి పోతుంది. ఇక పవన్‌తో కష్టమని భావించిన హరీష్ శంకర్ ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా హరీష్ శంకర్, క్రిష్లకి పవన్ రూపంలొఓ అదృష్టం వరించినా విధిరాతనో ఏమో కాని వచ్చిన అవకాశాన్ని అనుకున్నంత ఆనందంగా ఆస్వాదించలేకపోవడం గమనార్హం.