‘మాజీ లవర్‌ను కొందరు శత్రువులా చూస్తుంటారు. కానీ ప్రేమకంటే ముందు వారి మధ్య ఉండేది స్నేహమే. అదే స్నేహాన్ని విడిపోయిన తర్వాత కూడా కొనసాగించవొచ్చు. ఈ పాయింట్‌తో ‘దిల్ రూబా’ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు దర్శకుడు విశ్వకరుణ్. దర్శకుడిగా ఆయన తొలిచిత్రమిది. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వకరుణ్ శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘మా స్వస్థలం తాడేపల్లిగూడెం.
భీమవరంలో చదువుకున్నా. స్కూల్ రోజుల నుంచే సినిమాలంటే ఆసక్తి. అలాగే సాహిత్యం అంటే మక్కువ. కిరణ్ అబ్బవరంకు ఈ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. ఇందులో ఆయన సిద్ధు ఆనే యువకుడి పాత్రలో కనిపిస్తారు. తన తప్పులేనప్పుడు సారీ ఎందుకు చెప్పాలన్నది సిద్ధు స్వభావం. వ్యక్తిత్వం విషయంలో అతను ఎప్పుడూ రాజీ పడడు. తన క్యారెక్టర్‌నే నమ్ముకుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో తలెత్తే సంఘర్షణే ఈ చిత్ర ఇతివృత్తం’ అన్నారు.
విడిపోయాక కూడా మాజీ ప్రేయసికి ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడగటంలో తప్పులేదని, ఇలాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయని విశ్వకరుణ్ తెలిపారు. తాను పుస్తకాలను బాగా చదువుతానని, చలం, యండమూరి, జంధ్యాల, త్రివిక్రమ్‌ల ప్రభావం తనపై చాలా ఉందని ఆయన చెప్పారు. మనం చూసిన మనుషులు, సందర్భాలే ఏ కథకైనా స్ఫూర్తినిస్తాయని, ‘దిల్ రూబా’ ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని విశ్వకరుణ్ అన్నారు.