‘నిన్ననే ఫైనల్ చూసుకున్నాం. ఔట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. స్త్రీలు గౌరవంగా ఫీలయ్యేలా సినిమా ఉంటుంది. అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇది.’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన న్యూ ఏజ్ కమర్షియల్ మూవీ ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. విశ్వ కరుణ్ దర్శకుడు. రవి, జోజో జోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం కిరణ్ అబ్బవరం విలేకరులతో ముచ్చటించారు. ‘2గంటల 20నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీలవ్వలేదు. ఓ మంచి సినిమా చూశామనే ఫీల్‌తో థియేటర్ నుంచి బయకు వస్తారు.’ అని చెప్పారు కిరణ్ అబ్బవరం.
ఇంకా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పడానికే ప్రెస్మీట్లో కథను రివీల్ చేశాం. లవ్‌లోని మ్యాజికల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ సినిమాకు రండి. ఇప్పటిదాకా సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం కామెడీగా చూపించారు. కానీ ఇందులో ఎక్స్ లవర్తోనూ స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్‌ని చూపించాం. ఇందులో నేను చేసిన సిద్ధు పాత్ర క్యారెక్టరైజేషన్ అందరికీ నచ్చుతుంది. సారీ, థ్యాంక్స్ అనే మాటలు ఎలా పడితే అలా వాడేయకూడదు. వాటికి ఓ విలువ అనేది ఉంది.. అనేది హీరో వెర్షన్. తను అనవసరంగా సారీలు, థ్యాంక్సులు చెప్పడు. ఇలాంటి క్యారెక్టర్ని ఇప్పటివరకూ నేను చేయలేదు. ఇందులో నేను కొత్తగా కనిపిస్తా.’ అని తెలిపారు కిరణ్ అబ్బవరం.