‘నాకు ఫ్యామిలీ కథలంటే ఇష్టం. ‘కలిసుందాంరా’ నా ఫేవరెట్ సినిమా. అలాంటి క్యూట్ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుండేది. అప్పుడే ఈ కథ తయారు చేసుకుని రోహిత్‌కు పంపించాను. ఆయన చదివి ఇంప్రస్ అయ్యారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.’ అని చెప్పారు దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి. ఆయన దర్శకత్వంలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సుందరకాండ’. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి విలేకరులతో ముచ్చటించారు.
‘30ఏండ్లు దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే.. దానికి ప్రత్యేకమైన క్వాలిటీలు వెతుక్కునే పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ల ఇంట్లోవాళ్ల పరిస్థితి ఏంటి? అనేదే ఈ చిత్ర కథ. సీతాన్వేషణలో విజయాన్ని సాధించిన హనుమ.. చల్లని కబురుతో సీతారాముల హృదయాలను సుందరమయం చేశాడు కాబట్టే ఆ ఘట్టానికి వాల్మీకి ‘సుందరకాండ’ అని పేరు పెట్టారు. అదో సెలబ్రేషన్. అయితే ఆ సెలబ్రేషన్‌కి ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అప్పుడు హనుమంతులవారు పెట్టినట్టే.. ఇందులో హీరో కూడా కొన్ని విషయాల్లో ఎఫెర్ట్స్ పెడతాడు.
అదేమిటి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. అందుకే ఈ సినిమాకు ‘సుందరకాండ’ అనే పేరు పెట్టాం. ఇది రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లవ్‌స్టోరీ. ఇందులో హీరో కంటే హీరోయిన్ ఏజ్డ్గా కనిపించాలి. అదే సమయంలో అందంగా ఉండాలి. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతుంటే మా దృష్టిలో పడ్డ కథానాయిక శ్రీదేవి విజయ్‌కుమార్. ఆమె కథ చెప్పగానే ఓకే చేశారు. ఈ పాత్రకోసం ఆమె చాలా ఎఫర్ట్ పెట్టారు. అలాగే వృతి వాఘాని పాత్రకు మంచి పేరు వస్తుంది. నరేష్, సత్య, సునైనా, వాసుకి ఇలా అందరి పాత్రలూ బావుంటాయి. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. అలాగే సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది.’ అని తెలిపారు వెంకటేశ్ నిమ్మలపూడి.