TN Cm Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ను ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కానుకను సీఎం విజయ్‌కు ఆయన అందజేశారు. ఆ సినిమాలో విజయ్ పాత్ర ఉపయోగించిన కారుకు చెందిన ఐకానిక్ నంబర్ ప్లేట్ ‘TN07CM2026’ను ఫ్రేమ్ కట్టించి మరీ ఆయనకు బహుమతిగా ఇవ్వడం విశేషం.
గత 2024 ఫిబ్రవరిలో విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీని స్థాపించిన కొన్ని నెలలకే ‘ది గోట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో ‘TN07CM2026’ అనే నంబర్ ప్లేట్ ఉన్న కారును విజయ్ నడుపుతూ కనిపిస్తారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు అప్పట్లోనే ఈ నంబర్ ప్లేట్ ద్వారా ముందే ఊహించి క్రిప్టిక్గా చూపించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్, మీమ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆ క్రేజీ నంబర్ ప్లేట్‌ను వెంకట్ ప్రభు స్వయంగా ముఖ్యమంత్రికి అందజేశారు.
ఈ అపురూపమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను వెంకట్ ప్రభు తన అధికారిక ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ అన్న చరిత్ర సృష్టించారని కొనియాడుతూ, మన ముఖ్యమంత్రి విజయ్ అన్నను కలిసి ఈ మొదటి అపురూప కానుకను ప్రెజెంట్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనంటూ ‘TN07CM2026’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇటీవల మే 10న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అత్యంత భారీ బహిరంగ సభలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా, రాజకీయాల్లో బిజీ అయిన విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు సమాచారం ఇస్తున్నాయి.
A history is made..
From a thought… to a vision… to this moment.
Happy to have met our honourable CM @TVKVijayHQ na today and present the very first manifestation of #GOAT. ❤️❤️❤️
This is only the beginning.
TN07CM2026 pic.twitter.com/VxwvFOKTo4— venkat prabhu (@vp_offl) May 18, 2026