చిరంజీవి అంటే మాస్.. మాస్ అంటే చిరంజీవి. ఇందులో రెండోమాట లేదు. చిరంజీవి సినిమా అంటే అభిమానులకు విందుభోజనమే. ‘వాల్తేరు వీరయ్య’తో రెండువందలకోట్ల క్లబ్లో చేరి నేటికీ తన ఇమేజ్ ఇసుమంతకూడా తగ్గలేదని నిరూపించారు చిరంజీవి. త్వరలో ‘బింబిసార’ఫేం వశిష్ఠ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారాయన.
సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నా సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లూ, మసాలా ఐటమ్స్ కామన్.
నా నుంచి జనం ఆశించింది నేను ఇవ్వాలి. నేను కూడా ఎలాంటి శారీరకశ్రమ లేకుండా అలా నడుచుకుంటూ కష్టంలేని కేరక్టర్లు చేసి, వాళ్లిచ్చే డబ్బుల్ని జేబులో వేసుకొని వెళ్లిపోవచ్చు. కానీ అలా చేయటానికి నా మనసొప్పుకోదు. అభిమానులకోసం పడే కష్టంలోనే ఆనందం ఉంటుంది నాకు’ అన్నారు చిరంజీవి. ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. వయసును కూడా లెక్కచేయకుండా నేటికీ డ్యాన్సులతో, ఫైట్లతో అభిమానుల్ని అలరిస్తున్నారు చిరంజీవి.
త్వరలో ఆయన వశిష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ని మరిపించేలా ఉంటుందని తెలుస్తున్నది. సొషియో ఫాంటసీ విషయంలో తప్ప ఎక్కడ కూడా ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’కీ తమ కథకూ పోలిక ఉండదని మేకర్స్ చెబుతున్నారు. ఇంకా ఈ సినిమా గురించి దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ ‘త్వరలోనే అందర్నీ సినిమాటిక్ అడ్వంచర్లోకి తీసుకెళ్లనున్నాం. రెడీగా ఉండండి’ అన్నారు. అనుష్క, మృణాల్ఠాకూర్ కథానాయికలుగా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.