Vishwambhara | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్‌ని తాజాగా పంచుకున్నాడు దర్శకుడు వశిష్ఠ.
మన పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలు (పైన 7, కింద 7) ఉన్నాయి. ఇందులో యమలోకం, స్వర్గలోకం, పాతాళలోకం వంటి లోకాలను ప్రేక్షకులు ఇప్పటికే చూశారని.. అయితే ‘విశ్వంభర’ సినిమాలో వీటన్నింటినీ దాటి పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు కొలువై ఉండే సత్యలోకం నేను చూపించబోతున్నా. ఈ 14 లోకాలకు సత్యలోకమే మూలం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో నేరుగా ఆ సత్యలోకానికి ఎలా వెళ్తాడు? హీరోయిన్ను ఎలా తిరిగి తీసుకువస్తాడు? అనేదే ఈ ‘విశ్వంభర’ కథ అంటూ వశిష్ఠ చెప్పుకోచ్చాడు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.