‘అమ్మానాన్నల భావోద్వేగాల గురించి కొంచెం విభిన్నంగా చెప్పాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అది వినోదంగా, ఉద్వేగంగా చెప్పాలనేది నా ఉద్దేశ్యం. అలాగే చైల్డ్ సెంటిమెంట్‌లో ఏదో తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్‌ని కూడా టచ్ చేస్తూ ఓ కథ రాసుకున్నాను. అ కథే ‘మనమే’.’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో, శర్వానంద్ కథానాయకుడిగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘మనమే’ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విలేకరులతో ముచ్చటించారు.
‘శర్వానంద్ సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే చేశారు. ఇందులో కొత్త శర్వాని చూస్తారు. ‘రన్ రాజా రన్’ని మించి వుంటుంది ఇందులో ఆయన ఎనర్జీ.’ అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే మోస్ట్ ఫేవరెట్. ఇందులో మా అబ్బాయి విక్రమాదిత్య నటించడం కూడా ఒక రీజన్. ఇందులోని చైల్డ్ కేరక్టర్ కోసం ముందునుంచీ వాడ్నే అనుకున్నాను.
నా నమ్మకాన్ని నిలబెట్టాడు విక్రమ్.’ అని ఆనందం వెలిబుచ్చారు. ‘ఇందులో పదహారు పాటలుంటాయి. కానీ అవి కథను నడిపించేవే తప్ప ఆపేవి కావు. పవన్‌కల్యాణ్ ‘ఖుషి’ ఆర్ఆర్ ఇందులో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా అనుకున్నప్పుడు విజువల్‌గా ఒక కలర్‌టోన్ ఫిక్స్ అయ్యాను. అది తెరపై చూస్తారు.’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. కథానాయిక పాత్రకు కృతిశెట్టి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందని, బ్రిలియంట్‌గా యాక్ట్ చేసిందని, ఇదొక సర్ప్రైజ్ కథాంశంతో తెరకెక్కిన సినిమా అని శ్రీరామ్ ఆదిత్య చెప్పారు.