‘ఇది ఓ హంగర్ కామెడీ ఎంటైర్టెనర్. ఇప్పటివరకూ తెలుగులో ఈ జానర్ రాలేదు. యమలీల, ఘటోత్కచుడు చిత్రాల్లా ఆడియన్స్‌ని థ్రిల్ చేసే సినిమా ఇది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. కడుపుబ్బా నవ్వించే హారర్ థ్రిల్లర్ ఇది. ఇందులో ఎమోషన్స్ కూడా మెండుగా ఉంటాయి.’ అని దర్శకుడు ఎస్.జె.శివ అన్నారు. ఆయన దర్శకత్వంలో కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’.
వైవా హర్ష టైటిల్ రోల్ చేశారు. లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మాతలు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.జె.శివ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘రెస్టారెంట్ పెట్టాలని కలలు కనే ఓ యువకుడి కథ ఇది.
అయిదుగు బ్యాచిలర్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కమెడియన్ ప్రవీణ్ ఫస్ట్‌టైమ్ హీరోగా చేశారు. అసలు నన్నడిగితే ఈ కథకు హీరోగా ప్రవీణ్ వందశాతం యాప్ట్. అద్భుతంగా చేశాడు కూడా.’ అని తెలిపారు. దిల్‌రాజు ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారని, శిరీష్ ఈ సినిమా చూసి మెచ్చుకున్నారని, ప్రతిష్టాత్మక ఎస్వీసీ సంస్థ ద్వారా సినిమా విడుదల అవ్వడం ఆనందంగా ఉందని ఎస్.జె.శివ చెప్పారు.