వెండితెరపై ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన 94వ యేట మెగా ఫోన్ పట్టనున్నారు. ఇది ఆయన కెరీర్లో 61వ సినిమా కావడం విశేషం. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అపారమైన అనుభవం, ఆధునిక ఆలోచనల కలగలుపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శనివారం ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ అనౌన్స్మెంట్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు. సింగీతంలోని క్రియేటివిటీ, ఆయనకు సినిమాలపై ఉన్న ప్రేమ, దర్శకులపై ఆయన ప్రభావం.. వీటన్నింటినీ గుర్తు చేసే క్లిప్స్‌తో ఈ వీడియో సాగింది. పుష్పక విమానం, విచిత్రసోదరులు, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి క్లాసిక్స్‌ని ఈ వీడియో గుర్తు చేసింది. భారతీయ సినీచరిత్రలో మైలురాయిగా ఈ ప్రాజెక్ట్ నిలువనున్నదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్.