దర్శకుడు శంకర్ అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. సామాజిక కథాంశాలకు వాణిజ్య హంగులను మేళవించిన ఆయన రూపొందించిన చిత్రాలు ఒకనాడు సంచలనం సృష్టించాయి. అయితే ఇటీవలకాలంలో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ పూర్వవైభవాన్ని పొందే దిశగా సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
శనివారం ఆయన తాజా సినిమా వివరాలను పంచుకున్నారు. తమిళనాట లక్ష కాపీలు అమ్ముడైన చారిత్రక నవల‘వేల్పారి’ని సినిమాగా తెరకెక్కించబోతున్నానని చెప్పారు. ఇది తన కలల ప్రాజెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. ‘ఒకప్పుడు ‘రోబో’ నా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఉండేది. ఇప్పుడు కొత్తగా ‘వేల్పారి’ వచ్చి చేరింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తీయాల్సి ఉంటుంది.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ‘అవతార్’ వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయాలనుకుంటున్నా. ప్రపంచమంతా గుర్తించే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో నా కల సాకారం కావాలని కోరుకుంటున్నా’ అని శంకర్ తెలిపారు. శంకర్ దర్శకత్వం వహించిన గత రెండు చిత్రాలు ‘ఇండియన్-2’ ‘గేమ్ ఛేంజర్’ బాక్సాపీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్ట్ విషయంలో శంకర్ తగు జాగ్రత్తలు తీసకుంటున్నారని తెలిసింది.