‘వారణాసి’ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలన్నీ నిజమయ్యాయి. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు రాజమౌళి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులందరూ ఇక సినిమా కోసం వేచి చూడటమే తరువాయి అన్నట్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ దర్శకధీరుడు రాజమౌళి పంచుకున్న పోస్టర్ కూడా సినిమా కథపై మరింతగా ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. భారీ ఉల్క భూమిని ఢీకొడుతున్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. భారతీయ పురాణాల నేపథ్యంలో సాగే ఈ సాహసగాథను భారీ విజువల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. దాదాపు వెయ్యికోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు సమాచారం. ఐమాక్స్ ఫార్మాట్‌తో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరుల ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.