‘ఫిక్షనల్ స్టోరీనే అయినా.. సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రేరణ ఈ కథలో ఉంటుంది. ఆడవాళ్లకే కాదు, మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఈ సినిమా చెబుతుంది. విడుదలయ్యాక చర్చకు దారి తీసే సినిమా ‘పరదా” అని దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేశారు. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రధారులు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ నిర్మాతలు రాజ్, డికె మద్దతుతో, ఆనంద మీడియా పతాకంపై శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ శనివారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ సినిమా కోసం చాలా వర్క్ చేశాం. మనాలి, ధర్మశాల.. ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్లలో వందమంది క్రూతో ఈ సినిమాను షూట్ చేశాం. గౌతమ్ మేనన్, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్ ఇలా చాలా పెద్ద కాన్వాస్ ఉంది. మా వరకు ఇది ‘బాహుబలి’ లాంటి సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్స్కి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి.’
అని చెప్పారు ప్రవీణ్ కాండ్రేగుల. ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా రియల్ లొకేషన్లోకి వెళ్లి ఈ సినిమాను షూట్ చేశామని, ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే తపనతో చేసిన సినిమా ఇదని, ఈ సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ ఉందని, అదేంటో సినిమాలోనే చూడాలని ప్రవీణ్ పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ అనుపమ వేరు. ఈ సినిమా తర్వాత అనుపమ వేరు. ఆమెను గొప్ప నటిగా ఆవిష్కృతం చేసే సినిమా ఇది. కళ్లు చెమ్మగిల్లే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. మంచి కథ కావడంతో గోపీసుందర్ ప్రాణం పెట్టి సంగీతం అందించారు. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుంది.’ అని తెలిపారు దర్శకుడు ప్రవీణ్.