‘పతంగ్’ చిత్రానికి అంతటా హిట్‌టాక్ వచ్చిందని, స్థానిక పతంగుల క్రీడ నేపథ్యంలో ఈ తరహా సినిమా తీయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పారు చిత్ర దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి. నూతన తారాగణంతో తెరకెక్కిన ‘పతంగ్’ చిత్రాన్ని విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ తన స్వస్థలం అని, రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డీఎఫ్ టెక్ చేశానని, దర్శకుడిగా తన తొలి చిత్రమిదని తెలిపారు. రగ్బిలాంటి విదేశీ క్రీడలతో సినిమాలు తీసిన మనం, స్థానిక క్రీడ అయిన పతంగుల పోటీని ఎందుకు తెరకెక్కించకూడదనే ఆలోచనతో ఈ సినిమా తీశానన్నారు.
పతంగులు ఎగిరే దృశ్యాలను రియల్ ఫీల్‌తో సీజీలో చూపించామని, అందుకే సినిమా విడుదలకు రెండేళ్ల టైమ్ పట్టిందని ప్రణీత్ పత్తిపాటి పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్ ైస్టెల్‌ని చూసిన కొందరు మిత్రులు తనను దర్శకుడు శేఖర్ కమ్ములతో పోల్చుతున్నారని, అదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
జనవరి 1న ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని, వాణిజ్య కథాంశాలను వినోదాత్మక కోణంలో చూపించడం తనకు బాగా ఇష్టమని, తదుపరి చిత్రాన్ని మరింత హాస్యప్రధానంగా రూపొందించబోతున్నానని ప్రణీత్ పత్తిపాటి తెలిపారు.